మరో రెండు, మూడు రోజుల్లో ట్రైల్స్ విల్లాస్ లింక్ రోడ్డు అందుబాటులోకి
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదేశాలతో పనులు ముమ్మరం
మణికొండ తెలంగాణ కానుక
మణికొండ డివిజన్ పరిధిలో రహదారి అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు అధికారులు రోడ్ల నిర్మాణ విస్తీర్ణ పనులను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ట్రైల్స్ విల్లాస్ నుంచి పంచవటి కాలనీ మీదుగా మల్కం చెరువు వైపు వెళ్లే రహదారిని ట్రైల్స్ విల్లాస్‌కు అనుసంధానం చేసే లింక్ రోడ్డు పనులు పూర్తికావడంతో మరో రెండు, మూడు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
సుమారు 15 రోజుల క్రితం మణికొండ , నెక్నాపూర్ డివిజన్ పరిధిలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రహదారుల అభివృద్ధి పనులు, రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రైల్స్ విల్లాస్ నుంచి పంచవటి కాలనీ వరకు రహదారి పనులు కొంతమేర పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన లింక్ రోడ్డును వెంటనే అనుసంధానం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేసి, మరో రెండు, మూడు రోజుల్లో రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ట్రైల్స్ విల్లాస్ వద్ద లింక్ రోడ్డు పనుల పురోగతిని మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి , మణికొండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుద్దోలు శ్రీరాములు , నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏర్పుల కుమార్, నాయకులు శ్రవణ్ కుమార్ తదితరులు పరిశీలించారు.
అదేవిధంగా, మణికొండ శివాలయం సమీపంలోని విజేత సూపర్ మార్కెట్ నుంచి ఎస్‌సీ శ్మశానవాటిక మీదుగా చిత్రపురి కాలనీ వరకు నూతన రహదారి నిర్మాణ పనులు కూడా చేపట్టి, రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అలాగే మర్రిచెట్టు నుంచి హరివిల్లు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించిన విస్తరణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా మర్రిచెట్టు వద్ద వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకునేలా రహదారిని విస్తరించి, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే విధంగా పనులు చేపట్టనున్నారు.
ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే మణికొండ డివిజన్ పరిధిలోని కాలనీల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చొరవతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
