నార్సింగి స్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల తనిఖీ

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

నార్సింగి గ్రామంలోని పురాతన స్మశాన వాటికలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నార్సింగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యాతం అశోక్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో మంగళవారం గండిపేట్ మండల రెవెన్యూ అధికారులు స్మశాన వాటికను పరిశీలించారు.

నిజాం కాలం నాటి నుండి గ్రామస్తుల అంత్యక్రియల కోసం ఉపయోగిస్తున్న సుమారు ఎకరం స్మశాన వాటిక స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అశోక్ యాదవ్ ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు మంగళవారం గండిపేట్ మండల రెవెన్యూ అధికారులు నార్సింగి గ్రామానికి చేరుకుని పురాతన స్మశాన వాటికలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా అశోక్ యాదవ్ కబ్జాకు గురైన ప్రాంతాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్మశాన వాటిక హద్దులను, ఆక్రమణకు గురైన స్థలాన్ని అధికారులకు చూపించారు. గ్రామ పెద్ద అక్రుద్దీన్ నిజాం కాలంలో కేటాయించిన ఈ భూమిని కాపాడాలని కోరారు.

దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు త్వరలోనే స్మశాన వాటిక భూమికి సంబంధించి పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారని అశోక్ యాదవ్ తెలిపారు. సర్వే అనంతరం అక్రమ నిర్మాణాల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.

అధికారులు సానుకూలంగా స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మోహన్ రాజు వీఆర్వో రఘుపతి రెడ్డి సర్వేర్ సాయి కాంత్ గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *