మఠంపల్లి: తెలంగాణ కానుక
తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి విమర్శించారు.హుజూర్‌నగర్ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ యువ నాయకుడు పిల్లుట్ల రఘుతో కలిసి మఠంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలను సందర్శించిన ఆయన.. విద్యార్థులు,ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి తగ్గిందని ఆరోపించారు. 680 మంది విద్యార్థులకు ఒక్క వార్డెన్ కూడా లేరని, ఒక ఉపాధ్యాయుడే వార్డెన్ బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందన్నారు. అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కేవలం ఒక్క స్టాఫ్ నర్సు మాత్రమే ఉండటం కూడా ఆందోళనకరమన్నారు. అవసరమైన చోట వార్డెన్లు, స్టాఫ్ నర్సులను నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదేవిధంగా, పారిశుద్ధ్యంపై విద్యార్థుల ఆవేదన, పాఠశాలలో దోమలు,కుక్కల సమస్యతో పాటు హైజీన్, శానిటేషన్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని రాకేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.పీఆర్సీ.. డీఏలపై ఉద్యోగుల గోడు..గురుకుల ఉపాధ్యాయులు, పార్ట్‌టైమ్ లెక్చరర్లు, ఫ్యాకల్టీ సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని రాకేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పీఆర్సీ అమలు చేయకపోవడం, పెండింగ్ డీఏలు చెల్లించకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీ వేతనాలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే గురుకులాలను మరింత బలోపేతం చేయాలి. గురుకుల విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, అలాంటి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో గురుకులాల్లో కల్పించిన వసతులను కొనసాగించడంతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ యువ నాయకుడు పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గురుకులాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై నిఘా ఉంటుంది,ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో చేపట్టే పనుల్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి అవకాశం కల్పించే చర్యలను బీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి సారించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణమరాజు, తెలంగాణ ఉద్యమకారుడు నగేష్ రాథోడ్, పిల్లుట్ల కొండలు, మఠంపల్లి మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
