పెబ్బేరు తెలంగాణ కానుక
కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెబ్బేరు ఎస్‌ఐ వెంకటేష్ గౌడ్ సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రంగాపురం, రాంపూర్ గ్రామాల పరిధిలోని పుష్కర ఘాట్ సమీప కృష్ణానది తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, అలాగే ఎవరూ కూడా నది ఒడ్డుకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ముఖ్యంగా చేపల వేటకు వెళ్లేవారు, నదిలోకి దిగేవారు, సెల్ఫీలు లేదా రీల్స్ తీసుకునేవారు నది ఒడ్డుకు లేదా ప్రవాహంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, చెరువుల వద్ద చేపల వేట కోసం వెళ్లడం ప్రమాదకరమని తెలిపారు.
అలాగే వరద నీటిలో సెల్ఫీలు, రీల్స్ చిత్రీకరించడం లేదా ఈత కొట్టేందుకు ప్రయత్నించడం చేయవద్దని సూచించారు. రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో కల్వర్టులు, వంతెనలు దాటే సాహసాలు చేయరాదని హెచ్చరించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్థానిక పోలీసులను లేదా డయల్–100కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ వెంకటేష్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
