హైదరాబాద్, తెలంగాణ కానుక
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, బోడుప్పల్ మున్సిపాలిటీ, చెంగిచెర్ల విలేజ్‌లోని జయప్రద కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన 4400 గజాలను హైడ్రా కాపాడింది. ఇందులో పార్కు కోసం కేటాయించిన 1200ల గజాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లకోసం 1200ల గజాలు, దేవాలయాలకు ఉద్దేశించిన 400ల గజాలు, పాఠశాలతో పాటు గ్రంథాలయానికి కేటాయించిన 800ల గజాలు, వాటర్ ట్యాంక్ కోసం కేటాయించిన 800ల గజాలు స్థలాలు ఇందులో ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన స్థలాన్ని ఇంటి స్థలాలుగా మార్చేయడం పట్ల జయప్రద కాలనీ నివాసితులు ఆందోలన చెందారు. ఇలా ఇప్పటికే 2 ఇళ్లు నిర్మాణం జరిగింది. వరుసగా ఆక్రమణలు జరుగుతుండడం పట్ల జయప్రద కాలనీ వాసులు ఆందోళన చెందారు. ఇదే విషయమై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెనువెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించి.. ఆక్రమణలను నిర్ధారించుకుంది. ఈ మేరకు పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ. 25 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
