గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) డిప్యూటీ మేయర్‌గా ఐదేళ్ల పాటు నిరంతర సేవలందించిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి పదవీకాలం మంగళవారం తో అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన పదవీకాలాన్ని సఫలీకృతం చేయడంలో సహకరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి కమిషనర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, అలాగే నగర ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను ప్రజాసేవే పరమావధిగా భావించి నిర్వర్తించానని ఆమె పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, రహదారి విస్తరణ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, మురుగునీటి శుద్ధి కేంద్రాల అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి కీలక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి నడిపించారు.
ప్రత్యేకంగా 2020, 2021 సంవత్సరాల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల సమయంలో సహాయక చర్యలను సమన్వయం చేస్తూ, ప్రభావిత ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేయడం, తక్షణ సహాయం అందించడం, పునరావాస చర్యలు చేపట్టడం ద్వారా బాధిత కుటుంబాలకు ధైర్యం చేకూర్చారని అధికారులు గుర్తుచేశారు. వరద నివారణ చర్యల్లో భాగంగా నాలాల అభివృద్ధి, బాక్స్ డ్రైన్ల నిర్మాణం, అక్రమ కట్టడాల తొలగింపు, వర్షపు నీటి సత్వర ప్రవాహానికి మార్గాలు కల్పించడం వంటి కీలక నిర్ణయాలు అమలు చేశారని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, స్వయం సహాయక సంఘాల బలోపేతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు, బాలికల విద్యకు ప్రోత్సాహం, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, నిరుపేద వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరవ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు, పార్కుల అభివృద్ధి, సరస్సుల పునరుజ్జీవనం, జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
కోవిడ్–19 మహమ్మారి సమయంలో నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందుండి పనిచేస్తూ, శానిటైజేషన్ డ్రైవ్స్, ఉచిత ఆహార పంపిణీ, క్వారంటైన్ కేంద్రాల పర్యవేక్షణ, వైద్య సేవల సమన్వయం వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారని తెలిపారు. పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రక్షణ సామగ్రి అందజేయడంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారని అధికారులు తెలిపారు. ఈరోజుతో జిహెచ్ఎంసి ఎన్నికైన పాలకవర్గం ఐదేళ్ల పాలన కూడా ముగియనుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగిన ఈ పాలకవర్గం నగరాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో విశేషమైన పురోగతి సాధించి, హైదరాబాద్‌ను మరింత ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా గట్టి అడుగులు వేసిందని పలువురు అభిప్రాయపడ్డారు.
