‘వికసిత్ భారత్ 2047’ సాధన లక్ష్యంగా నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగ మేళాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Spread the love

కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాల్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితితో నియామక ప్రక్రియలను చేపడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో గల సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన 18వ విడత ఉద్యోగ మేళాలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో నియామక ప్రక్రియ క్రమబద్ధీకరణ, వేగవంతం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు 2022 నుంచి రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన యువత వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తారు” అని ఆయన అన్నారు.

ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా… అంకుర సంస్థలను ప్రోత్సహించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పనను పెంచడంపై కేంద్రం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. “ప్రస్తుత ప్రపంచ అనిశ్చితుల మధ్య ప్రపంచ దేశాలకు భారత్ నమ్మకమైన గమ్యస్థానంగా ఉంది. ఆయా దేశాల నుంచి వచ్చే కొత్త పెట్టుబడులు మన దేశంలో ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడతాయి” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 213 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి నియామక పత్రాలను అందజేశారు. సీఆర్‌పీఎఫ్‌లో 179, ఎస్‌ఎస్‌బీలో 5, ఐటీబీపీలో 16, బీఎస్‌ఎఫ్‌లో 5, ఐఎఫ్‌ఎల్‌యూలో 1, ఐఐటీ-హైదరాబాద్‌లో 3, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1, విద్యా మంత్రిత్వ శాఖలో 3 ప్రొఫెసర్ పోస్టులు వీటిలో భాగంగా ఉన్నాయి. ఉద్యోగం పొందిన వారిలో 15 మంది మహిళలు ఉన్నారు.

సౌత్ జోన్ మెడికల్ ఐజీ గణేష్ చంద్ర పాడి, హైదరాబాద్ సెంటర్ డీఐజీ ఉదయ భాస్కర్ బిల్లా, కమాండెంట్ మోహన్ దాస్ కోబ్రుగాడే సహా సీనియర్ సీఆర్‌పీఎఫ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

18వ రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొత్తగా నియమితులైన 61,000 మంది అభ్యర్థులు… హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం సహా భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *