హైదరాబాద్‌లోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (ఎన్ఐఎస్ఏ) శనివారం జరిగిన 18వ ఉద్యోగ మేళాకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కొత్తగా ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన 17 ఉద్యోగ మేళాల ద్వారా యువతకు 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం అందించిందని ఆయన పేర్కొన్నారు. 18వ ఉద్యోగ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 61,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉద్యోగ మేళా అనేది భరోసా, ఆత్మవిశ్వాసం, బలాన్ని ఇచ్చే వేదికగా నిలుస్తుందని.. ఇది వారు చదువులు, వృత్తిని అంకితభావంతో కొనసాగించేలా ప్రేరేపిస్తుందని కేంద్ర మంత్రి స్ఫష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తూ సకాలంలో నియామకాలను చేపడుతోందని ఆయన తెలిపారు. ఒక్క ఆరోపణ కూడా లేకుండా 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అందించడం.. నియామక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాత, విశ్వసనీయతను తెలియజేస్తోందని ఆయన అన్నారు.
కేవలం జీతం కోసమే కాకుండా దేశం, సమాజానికి అంకితభావం, స్ఫూర్తితో సేవ చేయాలని ఎంపికైన కొత్త ఉద్యోగులను బండి సంజయ్ కుమార్ కోరారు. వికసిత్ భారత్ – 2047 దార్శనికతతో దేశాన్ని అభివృద్ధి చెందినదిగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో కొత్త ఉద్యోగులు చురుగ్గా సహకరించాలని పిలుపునిచ్చారు.
కొత్తగా ఎంపికైన 61,000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 18వ ఉద్యోగ మేళాను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్ఐఎస్ఏలో మొత్తం 238 మంది అభ్యర్థులు నియామక పత్రాలను అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఉద్యోగ మేళాలను ఉద్దేశించి ప్రసంగించారు.
నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని పొందేందుకు కష్టపడ్డ తీరు, అనుభవాలను పంచుకున్నారు. వేగవంతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ డీ.పీ. పరిహార్, ఎన్ఐఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామోర్ పాల్గొన్నారు.
