గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి.

Spread the love

అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇంటింటికీ సంక్షేమం.. సర్పంచులదే బాధ్యత
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం విజయాన్ని అందించారని స్పష్టం చేశారు. “సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఇందులో సర్పంచులు కీలక పాత్ర పోషించి, పథకాలను ఇంటింటికీ చేర్చాలి” అని సూచించారు.
త్వరలోనే మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అధైర్యపడొద్దని, మరో మూడు విడతల్లో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. డ్వాక్రా రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత
ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు. “సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. దీని కోసం వచ్చే బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయిస్తాం” అని ప్రకటించారు. రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు సత్తా చాటాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *