మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఎన్నికల అధికారులకు విధుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతి అంశంపై పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం పరిధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఫోటో ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల వివరాల ప్రకటన, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాల ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ జాబితాలో ఉండేలా పర్యవేక్షించాలని, ఓకే కుటుంబానికి చెందిన అర్హత గల ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చూడాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి, డి ఆర్ వో హరిప్రియ మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
