రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమస్యలు వచ్చాక స్పందించడం కంటే, రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.రాబోయే వేసవిలో ఎక్కడా నీటి కొరత రాకుండా రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.స్వలాభం కోసం అనవసరంగా కొత్త బోర్లు వేయాలని ప్రోత్సహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
మేడారం జాతర ఏర్పాట్లు:
మేడారం మహా జాతరలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన మేడారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జాతర ఆహ్వానం: మేడారం జాతర సందర్భంగా మిషన్ భగీరథ సిబ్బంది తరపున ఈఎన్సీ కృపాకర్ రెడ్డికి మంత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
