రాజధానిలో మరో కొత్త జిల్లా? రంగారెడ్డి రెండు జిల్లాలుగా ఏర్పాటు!

Spread the love

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన విధంగానే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు 3 పోలీస్‌ కమిషనరేట్లు, మూడు జిల్లాలున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నాలుగు పోలీస్‌ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల బౌండరీలను మార్చేందుకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధికి సమానంగా ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది. వీటికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ జిల్లాలో మార్పులు, చేర్పులు : హైదరాబాద్‌ జిల్లాలో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలో 16 మండలాలున్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి మార్చనున్నట్లుగా తెలుస్తోంది. అమీర్‌పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజ్​గిరి ప్రాంతంలో భాగం చేయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్‌పురలు ప్రస్తుతం ఉండగా, ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాలకు విస్తరించనుంది. ఈ మండలాల్లో జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాదా మున్సిపల్ కార్పొరేషన్) పరిధి ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకి రానున్నట్లుగా తెలుస్తోంది.

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంపై నిర్ణయం పెండింగ్‌ : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉంది. పునర్విభజన అనంతరం మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌, సరూర్‌నగర్ మండలాలు విలీనం కానున్నాయి. పునర్విభజన అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్‌(రంగారెడ్డి జిల్లా), కంటోన్మెంట్‌(హైదరాబాద్‌ జిల్లా) శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఉండగా అది జీహెచ్‌ఎంసీ పరిధి దాటి ఉండడం వల్ల ఈ మండలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రంగారెడ్డి పరిధిలో మార్పులు :
రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గేటెడ్‌ కమ్యూనిటీలుండడం వల్ల అర్బన్, రూరల్‌ జిల్లాలుగా విభజించనున్నట్లుగా సమాచారం. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధి మొత్తాన్ని అర్బన్‌ జిల్లాగా, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధిని రూరల్‌ జిల్లాగా విభజించనున్నారు. షాద్‌నగర్, శంషాబాద్‌ రూరల్‌ మండలం, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్‌ జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. జనగణన(సెన్సస్)-2027లో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా హౌసింగ్‌ సెన్సస్‌ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరలోపు పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నామని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

జీహెచ్​ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలు : హైదరాబాద్​ మహానగరం బృహత్​ నగరంగా మారిందనే విషయం తెలిసిందే. ఈ జీహెచ్​ఎంసీ విస్తరణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వారం రోజుల వ్యవధిలోనే మొత్తం తంతు పూర్తి చేసింది. ఔటర్​ రింగ్​ రోడ్డును(ఓఆర్​ఆర్​) ఆనుకొని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్​ఎంసీలో(గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​) విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హైదరాబాద్​ మహానగర సరిహద్దులు అనేవి ఔటర్​ రింగ్​ రోడ్డు వరకు విస్తరించాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *