విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి , వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్ పున్నెల్ రోడ్ లోని స్వర్ణ , ఉజ్వల స్థంబాల తయారీ కేంద్రలతో పాటు , బిబి నగర్ గూడూరులోని మంచుకొండ స్థంబాల తయారీ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో సందర్శించి, తయారీ ప్రక్రియను కూలంకశంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ యూనిట్లలో జరుగుతున్న పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. స్తంభాల మన్నికను నిర్ధారించే పలు సాంకేతిక అంశాలపై సీఎండీ ప్రత్యేక దృష్టి సారించి పలు సూచనలు చేశారు . స్తంభాల తయారీలో వాడే సిమెంట్, ఇసుక మరియు కంకర మిశ్రమ నిష్పత్తిని తనిఖీ చేశారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారమే మిక్సింగ్ జరుగుతుందో లేదో పరిశీలించారు. స్తంభాలకు తగినంత దృఢత్వం రావడానికి అవసరమైన ‘క్యూరింగ్’ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నిర్ణీత రోజుల పాటు క్యూరింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
స్తంభం ఎంత భారాన్ని తట్టుకోగలదో పరీక్షించే ‘బ్రేకింగ్ టెస్ట్’ను ఆయన సమక్షంలోనే నిర్వహించగా దాని ఫలితాలను విశ్లేషించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, భారీ గాలులు వీచినప్పుడు విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా ఉండాలంటే తయారీ దశలోనే అత్యున్నత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. కాబట్టి, తయారీదారులు ఎటువంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సీఎండీతో పాటు చీఫ్ ఇంజనీర్ కె . తిరుమల్ రావు , ఎస్ ఈ సివిల్ వెంకటేశ్వర్లు తదితర ఇంజనీరింగ్ అధికారులు, తయారీ కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు.
