వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు.
వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోఠిలోని వివేక వర్ధిని విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
వీవీ కళాశాలలో నిర్వహించిన వందేమాతరం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ, వందేమాతరం నినాదం భారతీయుల ఆత్మగౌరవానికి, స్వాతంత్ర్యోద్యమంలో వారి తపన-త్యాగాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యం, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
బ్రిటిష్ పాలకుల “విభజించి పాలించు” విధానానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన శక్తి వందేమాతరమేనని, కులం, మతం, ప్రాంత భేదాలు మరిచి “దేశమే ప్రథమం” అన్న భావనను పెంపొందించిందని మంత్రి అన్నారు.
1905 బెంగాల్ విభజన ఉద్యమం నుంచి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి స్వాతంత్ర్య పోరాటంలోనూ వందేమాతరం నినాదం మార్మోగిందని గుర్తు చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేలా చేసిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కి మనం ఎప్పటికీ రుణ పడి ఉంటాం. 1938లో నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైన వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వందేమాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారని, ఆ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, మేధావులు త్యాగాలు చేశారని మంత్రి అన్నారు.
వందేమాతరం నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా వివిధ సామాజిక, జాతీయ సంస్థలు రాజకీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యపోరాటం చేసిన చరిత్ర హైదరాబాద్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ పునర్నిర్మాణంలో, వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.
శృతి పాటిల్, అదనపు డైరెక్టర్ జనరల్, సీబీసీ, పీఐబీ, తన ప్రారంభ ప్రసంగంలో వందే మాతరం శాశ్వత శక్తి, భారత జాతీయ గుర్తింపును తీర్చిదిద్దడంలో దాని కీలక పాత్రను ప్రస్తావించారు. ఈ పదాల ఆత్మ చరిత్ర పుటలను మించి విస్తరించి, తరతరాలుగా ప్రజలను ప్రేరేపిస్తూ దేశవ్యాప్తంగా లోతైన దేశభక్తి భావాన్ని పెంపొందించిందని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటులో ఇటీవల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ, భారత్ సహనశక్తి, అంతర్గత బలాన్ని ఆమె పునరుద్ఘాటించారు. ప్రతి సవాలును అధిగమించే దేశ సామర్థ్యాన్ని ప్రతిబింబించేదే వందే మాతర సారమని ఆమె వ్యాఖ్యానించారు.
వందే మాతరం ప్రయాణానికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలిపారు. ఈ ప్రయత్నం వందే మాతర అసాధారణ వారసత్వాన్ని ప్రదర్శించడమే కాక, జాతీయ వాదాన్ని పునరుద్దీపింపజేయడం, పౌరులు భారతదేశంతో భావోద్వేగపరంగా, సాంస్కృతికంగా మళ్లీ అనుసంధానమయ్యేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆమె అన్నారు.
వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రదర్శన డిసెంబర్ 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సందర్శకుల కోసం ఇంటరాక్టివ్ స్పాట్ ఆన్‌లైన్ క్విజ్‌ను ఏర్పాటు చేసి, అర్హత సాధించిన వారికి వెంటనే సర్టిఫికేట్‌ను ఇమెయిల్, మొబైల్ లేదా క్యూఆర్ ( QR) ద్వారా అందించే సౌకర్యం కల్పించారు. యువతను ఆకర్షించేందుకు డిజిటల్ సెల్ఫీ కియోస్క్, సెల్ఫీ పాయింట్ లను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రాకేష్ జైస్వాల్, కార్పొరేటర్, జాంబాఘ్ డివిజన్, నాగేశ్ వి. రావు, జాయింట్ సెక్రటరీ, వీవీఈఎస్, డా. డి. విద్యాధర్, ప్రిన్సిపాల్, వి.వి. కాలేజ్,సిబిసి, పిఐబి అధికారులు, వీవీఈఎస్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
