గత పాలకులు రాష్ట్రాన్ని రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టినా.. పేదవాడి సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి మాటను ఈ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేలకొండపల్లి మండలంలో పర్యటించారు.
విద్యుత్ వెలుగులు.. కొత్త సబ్ స్టేషన్లు
కోనాయిగూడెం పంచాయతీ పరిధిలోని అనంత నగర్‌లో రూ. 2.25 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రులు ప్రారంభించారు. అదే వేదికపై ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామంలో రూ. 1.75 కోట్లతో నిర్మించనున్న మరో సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో మౌలిక వసతులు మెరుగుపరుస్తూ రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు.
ఏప్రిల్ లో రెండో విడత
సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. “వచ్చే ఏప్రిల్ నెలలో ప్రతి నియోజకవర్గానికి రెండో విడత ఇళ్లను తప్పనిసరిగా మంజూరు చేస్తాం. మాట తప్పే ప్రసక్తే లేదు” అని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75% సర్పంచులు ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపడం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు.
నిరంతరాయంగా సంక్షేమ పథకాలు
మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు నిరంతరాయంగా అందుతాయని మంత్రి వివరించారు. విద్యార్థుల పట్ల మమకారంతో కాస్మెటిక్ ఛార్జీలను 200%, డైట్ ఛార్జీలను 40% పెంచినట్లు తెలిపారు. అనంతరం 55 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అజయ్ తండాలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాయల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మి నారాయణ, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
