పరిశుభ్రతే నులిపురుగులకు విరుగుడు ,

Spread the love

హైదరాబాద్ తెలంగాణ కానుక

పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి రెడీ అయిన క్షణంలోనే కడుపునొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు తల్లిదండ్రులు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు. మరికొందరు ఆకస్మాత్తుగా వచ్చే నొప్పిని చూసి గాబరా పడతారు. ఒక్కోసారి ఇది నులిపురుగుల వల్ల అయ్యి ఉండవచ్చు. పిల్లల ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండే తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేసే నులిపురుగులు తయారు కావడానికి ప్రధాన కారణం పరిశుభ్రత పాటించక పోవడమే అని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు లిల్లీ మేరి అన్నారు. నులిపురుగులతో ఒక్కోసారి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణం అని ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు. జులై 20న నిర్వహించే మాప్ – అ ప్ డే సందర్భంగా మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు అందజేయాలని లిల్లీ మేరి అన్నారు.
సంవత్సరం పిల్లవాడి నుండి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులిపురుగులు, కొరడా పురుగులు, కొంకి పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు లాంటివి మన పొట్టలు చేరి అనేక రోగాలకు కారణం అవుతుంటాయి అని ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు.
పిల్లల్లో తలెత్తే సమస్యలు:
రక్తహీనత, ఆకలి మందగించడం, శారీరకంగా బలహీనులు కావడం, కడుపునొప్పి, వికారముగా ఉండడం, వాంతులు, విరోచనాలు, మలములో రక్తం రావడం, మానసిక ఆందోళన వంటి అనేక రకాల సమస్యలకు నులి పురుగులు కారణమవుతాయని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు లిల్లీ మేరి అన్నారు.
ఎలా వ్యాపిస్తాయి అంటే:
నులిపురుగుల గుడ్లు మలము ద్వారా బయటకు వచ్చి మట్టిని కలుషితం చేస్తాయని, ఈ గుడ్లు మట్టిలో లార్వాలుగా ఉంది చెందుతాయని లిల్లీ మేరి అన్నారు. పిల్లలు మట్టిలో ఆడుకోవటం, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వలన ఈ గుడ్లు లార్వాలు వారి లోపలికి చేరుకుంటాయని, పిల్లల్లో చేరిన లార్వాలు, గుడ్లు, క్రిములుగా వృద్ధి చెందుతాయని, ఎదిగిన నులిపురుగులు తిరిగి గుడ్లును ఉత్పత్తి చేసి పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయని లిల్లీ మేరి తెలిపారు.
ఒక్క మాత్రతో నులిపురుగులకు చెక్:
తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్లో నులిపురుగులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని ముఖ్యంగా పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రం తప్పనిసరిగా వేయాలని, ఈ మాత్రలను పంపిణీకై ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్రామాలల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుందని, ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఏవైనా కారణాలతో పాఠశాలలకు వెళ్ళని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలోనూ, 6 నుండి 19 సంవత్సరాల పిల్లలకు వారు చదువుకునే పాఠశాల ల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఈమాత్రలు వేస్తారని ఆచార్యులు లిల్లీ మేరి పేర్కొన్నారు.
మాత్రలతో ప్రయోజనాలు ఎన్నో:
ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడంతోపాటు వైద్యుల సూచనకు అనుగుణంగా ఆల్బెండజోల్ మాత్రలను క్రమం తప్పకుండా వెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా నులిపురుగుల భారి నుండి పిల్లలను కాపాడవచ్చు. రక్తహీనత,,పోషకాహార లోపము వంటి సమస్యలు అధిగమించవచ్చు. పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. శారీరక, మానసిక పెరుగుదలతో పాటు వికాసం పెంపొందుతుంది. పనిచేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు గల వారికి మాత్రలు వేయరాదని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు లిల్లీ మేరి పేర్కొన్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:
జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని, తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సహాయ ఆచార్యులు లిల్లీ మేరి తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తరువాత సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవాలి.బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించేలా చూడాలి. పెరిగిన గోళ్ళను ఎప్పటికప్పుడు తొలగించాలి. చేతి వేళ్లలో మట్టి లేకుండా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. వేడి ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారంపై ఎప్పుడు కప్పి ఉంచాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు లిల్లీ మేరి పేర్కొన్నారు.
ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు:
నులిపురుగుల నివారణకు మాత్రలు పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సలహాలు, సూచనలు అందిస్తారని మాత్రను వేయడానికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. విద్యార్థులు మాత్రను నేరుగా మింగకుండా చప్పరించిన తర్వాత మిగిలిన మాత్రను మింగేలా చూడాలని లిల్లీ మేరీ అన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి పూర్తి మాత్రను ఆరేళ్లలోపు వారికి సగం మాత్రను వేయాలని, సమీపంలోని ఆరోగ్య కేంద్రం ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, కడుపులో నులిపురుగులు ఎక్కువగా ఉండే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, తలనొప్పి, కడుపునొప్పి వంటి ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, అయితే వీటి వల్ల ఎలాంటి నష్టముండదని, వారిని కేవలం నీడలో కూర్చోబెడితే సరిపోతుంది అని, మాత్ర గొంతులో ఇరుక్కుపోయిన సందర్భంలో వారిని తొడలపై కూర్చోబెట్టుకొని వీపుపై మాత్ర బయటకు వచ్చేవరకు తట్టాలని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు లిల్లీ మేరి పేర్కొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *