ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఆదివారం నిర్వహించిన పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని సహచర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ , ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. దేవతామూర్తులను దర్శించుకొని తీర్థప్రసాదాలు, పండితుల వేదాశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గదుల వసతి సముదాయంతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించగా వారితో కలిసి అందులో పాల్గొన్నారు.
ఆడబిడ్డల ముఖాల్లో ప్రగతి తేజస్సు కనిపిస్తోంది
అనంతరం చెల్పూరులో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సభకు ఇందిరమ్మ చీరలను కట్టుకొని వచ్చిన ఆడబిడ్డలను చూసి ఆనందం చూస్తే వారి ముఖాల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రగతి తేజస్సు కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి, వారి భద్రతకు భరోసానిచ్చేందుకు ప్రజాప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులను చేపడుతూ వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు.
