గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం జిల్లా కేంద్రం లోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని
మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని తెలిపారు. త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలతో నిరంతరం సమన్వయం తో పారదర్శకంగా పాలన సాగించాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామాభివృద్ధి దిశగా సమర్థవంతంగా సేవలందించి, జిల్లాలోని గ్రామాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గ్రామాభివృద్ధి సంబంధిత కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పరిశుభ్రత, త్రాగునీరు, పచ్చదనం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే గ్రామాలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టే పనులన్నీ నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారిణి కామారెడ్డి జిల్లా గారి చే జారీ చేయనైనది.
