భారతీయ జనతా పార్టీ సంబరాలు.

Spread the love

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సంబురాలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. “జై బీజేపీ” నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సంబురాల్లో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, వేముల అశోక్, బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా శ్రీ నితిన్ నబీన్ గారు ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ గారి చేతుల మీదుగా శ్రీ నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సర్టిఫికేట్‌ను స్వీకరించారు.

45 ఏళ్ల వయసులోనే భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం బిజెపిలోనే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలోని బంకిపుర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్ గారు, పార్టీ కోసం నిరంతరం పనిచేసిన అంకితభావంతో ఈ కీలక బాధ్యతను చేపట్టడం గర్వకారణమని తెలిపారు.

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ…..

“45 ఏళ్ల వయసులోనే నితిన్ నబీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం భారతీయ జనతా పార్టీలో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని డా. బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. ఇతర ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అదే. అక్కడ పదవులు వంశపారంపర్యంగా, సీల్డ్ కవర్‌లో నిర్ణయిస్తారని అన్నారు.

భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్త కూడా కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఎదిగే అవకాశం ఉంది. బూత్ స్థాయి అధ్యక్షుడే దేశ పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం బిజెపిలోనే ఉంది. ఇది నిజమైన ప్రజాస్వామ్యమని ఆయన గుర్తుచేశారు.

భారతదేశంలో 30 కోట్లకు పైగా యువత ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బిజెపి. ఇతర పార్టీల్లో యువతకు అవకాశాలు లేకుండా కుటుంబం, డబ్బే పనిచేస్తాయి. కానీ బిజెపి యువతకు, సామాన్య కార్యకర్తలకు అవకాశాలు ఇస్తుందని,.. నితిన్ నబీన్ ఎన్నిక అదే స్పష్టం చేస్తోందని డా. బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

అలాగే, శ్రీ నితిన్ నబీన్ నాయకత్వంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని, తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేసి, ప్రధాని నరేంద్ర మోదీ కి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారికి గెలుపు కానుకగా ఇవ్వడం ప్రతి బిజెపి కార్యకర్త కర్తవ్యమని డా. బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *