సొంత ఖర్చుతో రూ. 2.50 లక్షలతో నూతన నీటి బోరు వేయించిన శంకర్ పల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్
శంకర్ పల్లి తెలంగాణ కానుక
శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో భక్తులకు, గ్రామ ప్రజలకు ఎదురవుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఓ దాత ముందుకు వచ్చారు.
శంకర్ పల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ తన సొంత ఖర్చులతో రూ. 2 లక్షల 50 వేల వ్యయంతో నూతన నీటి బోరును వేయించి, గ్రామానికి, ఆలయానికి అంకితం చేశారు.
మోకిలా మల్లన్న ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని, వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా ఉండేదని, ఈ నేపథ్యంలో భక్తులు, గ్రామ ప్రజల ఇబ్బందులు గమనించి తాను ఈ బోరు వేయించినట్లు వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు. దేవాలయ అభివృద్ధిలో తన వంతు సహకారం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
వెంకటేష్ ముదిరాజ్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు అభినందించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఆలయ చరిత్రలో ఇది మరువలేని సేవగా నిలుస్తుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌండ్రసత్యం పిఎసిఎస్ చైర్మన్ వేణుగోపాల్ ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, బీసీ సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
